రియాలిటీ షో బిగ్ బాస్… సీజన్ 3 రేసులో రానా, విజయ్

రియాలిటీ షో బిగ్ బాస్… సీజన్ 1, సీజన్ 2లకు ప్రేక్షకాదరణ లభించడంతో సీజన్ 3కి సన్నాహాలు మొదలయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ రియాలిటీ షోకి టాప్ రేటింగ్స్ వస్తుండంటతో తెలుగులో తొలిసారిగా 2017 జూలై 16న ప్రారంభించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ రియాలిటీ షోకి హోస్ట్‌గా వ్యవహరించడంతో బుల్లితెర చరిత్రలోనే అంతకు ముందెన్నడూ ఊహించని రేటింగ్స్‌ని రాబట్టింది. 70 రోజుల పాటు 14 మంది సెలబ్రిటీలతో జరిగిన ఈ రియాలిటీ షో సూపర్ సక్సెస్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 1 విజేతగా శివబాలాజీ నిలిచారు. అనంతరం 2018 జూన్ 10న సీజన్ 2 స్టార్ట్ చేశారు. నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించగా.. మొదటి సీజన్‌తో పోల్చుకుంటే కంటెస్టెంట్స్ వీక్ కావడం వల్ల ఈ సీజన్ 2 బుల్లితెర ప్రేక్షకులకు ఓ మోస్తరు వినోదాన్ని మాత్రమే అందించగలిగింది. ఎన్టీఆర్‌తో పోల్చుకుంటే నాని హోస్ట్‌గా ఒక అడుగు వెనుకనే ఉండిపోయారు.

ఇక రెండో సీజన్‌లో అనేక గొడవలు, వివాదాలు, రచ్చల నడుమ కౌశల్.. బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా అవతరించారు. ఇక బిగ్ బాస్ మొదటి సీజన్ జూలైలో ప్రారంభం కాగా.. రెండో సీజన్ ఒక నెల ముందుగానే అంటే.. జూన్‌లోనే ప్రారంభమైంది. కాగా.. బిగ్ బాస్ సీజన్ 3ని ఇంకాస్త ముందుగానే ప్రారంభించేందుకు కసరత్తులు మొదలు పెట్టిందట స్టార్ మా ఛానల్. అందుకోసం కీలకమైన హోస్ట్ కోసం వెతుకులాట మొదలుపెట్టారట. అయితే ఎన్టీఆర్ తిరిగి బుల్లితెరపై కనిపించేందుకు పెద్దగా ఇంట్రస్ట్ చూపించకపోవడంతో ఆయన ప్లేస్‌ను రీ ప్లేస్ చేసే పాపులారిటీ ఉన్న హీరో కోసం సెర్చ్ చేస్తున్నారట. సీజన్ 2లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయిన నానిని తిరిగి సీజన్ 3లోనూ హోస్ట్‌గా కొనసాగే అవకాశం లేకపోవడంతో టాలీవుడ్‌లో క్రేజీ స్టార్‌గా మారిన విజయ్ దేవరకొండ అయితే బెటర్ అనే ఆలోచనలో ఉందట స్టార్ మా సంస్థ.

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, టాక్సీవాలా, మహానటి, గీత గోవిందం తదితర చిత్రాలతో యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌లోనూ మంచి గుర్తింపు సంపాదించిన విజయ్ దేవరకొండను బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్‌గా బుల్లితెరపై సందడి చేయబోతున్నట్టు సమాచారం. అయితే హోస్ట్ చేయడం అంటే సినిమాల్లో నాలుగు డైలాగ్‌లు చెప్పడం.. ఆడియో ఫంక్షన్‌లో రెండు మూడు పంచ్‌లు వేయడం.. మీడియా ముందు నాలుగు ముక్కలు మాట్లాడటం అంత ఈజీ కాదు. హౌస్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తూ ఎవర్నీ నొప్పించక.. తానొప్పక.. ప్రేక్షకులకు కొదువ లేకుండా వినోదాన్ని అందించాలి. ఇందులో ఏ మాత్రం తేడా వచ్చినా సోషల్ మీడియాలో ఆడియన్స్ ఆటాడేస్తారు. ఇంకా చెప్పాలంటే ఆ ప్రభావం వారి సినిమాలపై కూడా పడొచ్చు. ఎన్టీఆర్, నానిలతో పోల్చుకుంటే మాట తీరులోనూ.. వాక్ఛాతుర్యంలోనూ అంతంత మాత్రంగానే ఉంటే విజయ్ దేవరకొండ ఇంత పెద్ద సాహసానికి పూనుకుంటాడా అంటే అది సందేహమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *