ఆరో దశ ఎన్నికలకు సర్వం సిద్ధం

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా ఆరో దశ ఎన్నికల పోలింగ్‌ ఆదివారం జరగనుంది. మొత్తం ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 59 లోక్‌సభ నియోజకవర్గాలకు ఈ దశలో ఎన్నికలు జరగనున్నాయి. 979 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ఈ దశలో 10.18కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 5.43కోట్లు కాగా.. మహిళా ఓటర్లు 4.75కోట్ల మంది ఉన్నారు. 

హరియాణాలో 10, మధ్యప్రదేశ్‌లో 8, ఉత్తరప్రదేశ్‌లో 14, బిహార్‌లో 8, పశ్చిమబెంగాల్‌లో 8, ఝార్ఖండ్‌లో 4, దిల్లీలో 7 లోక్‌సభ నియోజకవర్గాలకు రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభం కానుంది. పోలింగ్‌ నిమిత్తం 1,13,167 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆయా పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బంది చేరుకున్నారు. 

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారిన దేశ రాజధాని దిల్లీలో 60వేల మంది భద్రతాసిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. గత విడతల్లో పశ్చిమబెంగాల్‌లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో ఈ సారి 770 కేంద్ర బలగాల బృందాలను రంగంలోకి దింపారు. 

పోటీలో ఉన్న ప్రముఖులు వీరే.. 

ఆరో దశలో పలువురు ముఖ్య నేతలతో పాటు సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు బరిలో ఉన్నారు. మాజీ క్రికెటర్ గౌతమ్‌ గంభీర్‌, భాజపా నేతలు నరేంద్రసింగ్‌ తోమర్‌, రిటా బహుగణ జోషి, మేనకా గాంధీ, రాధా మోహన్‌ సింగ్‌, సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌,  కాంగ్రెస్‌ నుంచి దిగ్విజయ్‌ సింగ్‌, షీలా దీక్షిత్‌, జ్యోతిరాదిత్య సింధియా, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌, భోజ్‌పురి నటుడు దినేల్‌ లాల్‌ యాదవ్‌ తదితరులు ఈ దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 

అత్యధిక ఆస్తులు వీరికే..

ఈ దశలో సంపన్న అభ్యర్థి కాంగ్రెస్‌కు చెందిన జ్యోతిరాదిత్య సింధియా. గుణ నుంచి పోటీ చేస్తున్న ఆయన ఆస్తులు రూ. 374కోట్లు. ఆ తర్వాత తూర్పు దిల్లీ నుంచి భాజపా అభ్యర్థిగా బరిలోకి దిగిన గౌతం గంభీర్‌ తనకు రూ. 147కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. హరియాణాలోని గురుగ్రామ్‌ నుంచి పోటీ చేస్తున్న వీరేంద్ర రాణాకు రూ. 102కోట్ల ఆస్తులున్నాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *