మీకు హిందుత్వమంటే తెలుసా?: దీదీ

కోల్‌కతా: ‘భారత ప్రధాన విభజన దారు ( ఇండియాస్‌ డివైడర్‌ ఇన్‌ చీఫ్‌) అంటూ ప్రధాని మోదీపై అంతర్జాతీయ పత్రిక ‘టైమ్‌’ ప్రచురించిన కథనంపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ స్పందించారు. హిందుత్వ వాదిగా చెప్పుకుంటున్నఆయనకు హిందుత్వం గురించి ఏమీ తెలియదని మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  పశ్చిమ్‌బంగాల్‌లోని బారాసత్‌ నియోజకవర్గంలో నిర్వహించిన ఓ ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. హిందుత్వాన్ని తమ భుజస్కందాలపై మోస్తున్నామని వాళ్లు చెప్పుకుంటారు. కానీ, హిందూ దేవుళ్లు ఎంతమంది ఉన్నారో? వారి పేర్లేమిటో కూడా వాళ్లకు తెలియవని మోదీని ఉద్దేశించి అన్నారు. ‘ మహంకాళి అవతారాలేంటో వాళ్లకు తెలుసా? అసలు మంత్రాలేమైనా వచ్చా? హిందూ సంస్కృతిలో చాలా దేవుళ్లు, దేవతలు ఉన్నారన్న విషయం వాళ్లకు తెలుసా?’ అని మమత ప్రశ్నించారు. ఈ సందర్భంగా ‘మరో ఐదేళ్లు మోదీ ప్రభుత్వాన్ని భారత్‌ భరించగలదా?’ అని టైం పత్రిక ప్రచురించిన అంశాన్ని ప్రస్తావించారు. భిన్నత్వంలో ఏకత్వమే మన సంస్కృతికి మూల స్తంభం అని దీదీ పేర్కొన్నారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌, సిక్‌  ఇలా వివిధ మతాలవారందరికీ పండగలుంటాయనీ, వాటన్నింటినీ ప్రజలంతా జరుపుకొంటారని మమత అన్నారు. అయితే వివిధ మతాల వారు రకరకాల సంస్కృతులను ఆచరిస్తారని చెప్పారు. ‘ఇక్కడి ప్రజలు అనుసరిస్తున్నది బెంగాలీ సంస్కృతి. వేరే వాళ్ల సంస్కృతిని మనమెందుకు ఆచరించాలి?’ అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ, దీదీ మధ్య గత కొన్ని రోజులుగా మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. భాజపా చెబుతున్న ‘జై శ్రీరామ్‌’ నినాదానికి పోటీగా రాష్ట్రంలో ‘జై హింద్‌’ అనే నినాదాన్ని దీదీ తీసుకొచ్చారు.

సంచులకొద్దీ డబ్బు
భాజపా నాయకులు సంచుల కొద్దీ డబ్బును ఇతర రాష్ట్రాలనుంచి తీసుకొచ్చి పశ్చిమ్‌ బెంగాల్‌లో కుమ్మరిస్తున్నారని మమతాబెనర్జీ ఆరోపించారు. ‘ ఎన్నికల్లో అంత డబ్బు ఎందుకు ఖర్చు చేయాలి? నిన్నే.. భాజపాకు చెందిన ఓ నేత రూ. కోట్లతో పట్టుబడిపోయాడు. జడ్‌ ప్లస్‌, వై ప్లస్‌ సెక్యూరిటీ ఉన్ననాయకులే డబ్బు మోసుకెళ్లిపోతున్నారు. తద్వరా ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల సంఘం వీరిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో అర్థం కావడం లేదు’ అని మమత అన్నారు.  భాజపాకు అంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దు సమయంలోనే ఇంత మొత్తం కూడగట్టారా? అని అనుమానం వ్యక్తం చేశారు. రఫేల్‌ కుంభకోణం ద్వారా భాజపా ఎంత సంపాదించిందని దీదీ ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *