మహారాష్ట్ర సరిహద్దుల్లో పది చెక్‌పోస్టులు : ఎస్‌పీ విష్ణు వారియర్‌

ఆగస్టు 12వ తేదీన జరుపుకొనే బక్రీద్‌ పండగ నేపథ్యంలో జిల్లాలో శాంతి, భద్రతల పరిరక్షణకు పొరుగునే ఉన్న మహారాష్ట్ర సరిహద్దుల్లో జిల్లా పోలీసులు పది చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఏర్పాట్లు చేసినట్లు ఎస్‌పీ విష్ణు వారియర్‌ పేర్కొన్నారు. బక్రీద్‌ పండగ సందర్భంగా వ్యాపారులు మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున పశువులను అక్రమంగా జిల్లాలోకి తరలించే అవకాశాలు ఉన్నాయని, ఇలాంటి అక్రమ తరలింపును నిరోధించటానికే చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇవి గురువారం నుంచి పని చేస్తాయన్నారు. చెక్‌పోస్టుల వద్ద ఏఎస్‌ఐ/హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు నలుగురు కానిస్టేబుళ్లు 24 గంటలు మూడు విడతల్లో విధులు నిర్వహించి ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తారన్నారు. సీఐ స్థాయి అధికారులు వీటిని పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. ప్రతి చెక్‌పోస్టు వద్ద పశుసంవర్థక శాఖ అధికారుల సహాకారం తీసుకోవటానికి పోలీసులను ఆదేశించామన్నారు. వాహనాల్లో క్రూరంగా, నిబంధనలకు విరుద్ధంగా పశువులను తరలిస్తే ‘మూగ జీవాల హింస నివారణ’ చట్టం కింద కేసులు నమోదు చేస్తామన్నారు. బక్రీద్‌ పండగను శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. పోలీసు అధికారులు ఇరువై నాలుగు గంటలు అప్రమత్తంగా ఉండాలని, అనుకోని సంఘటన ఎక్కడైన జరిగితే వెంటనే అక్కడకు నిమిషాల్లో చేరుకొనేలా ముందస్తుగానే సిద్ధంగా ఉండేలా వారిని ఆదేశించామన్నారు. ప్రశాంత వాతావరణం ఉండేలా చూడటానికి తనిఖీలు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *