తండ్రీ కొడుకులకు భాజపా భయం: లక్ష్మణ్‌

హైదరాబాద్‌: తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌కు తెలంగాణ రాజకీయాలు ఇంకా ఒంటబట్టలేదని భాజపా రాష్ర్ట అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌కు భాజపా భయం పట్టుకుందని.. రాత్రిపూట ఇద్దరికీ నిద్రపట్టడంలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ జర్నలిస్ట్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా 2020 డైరీని లక్ష్మణ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019 దేశ వ్యాప్తంగా భాజపాకు కలిసి వచ్చిందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో మెజార్టీ సాధించి రెండోసారి అధికారంలోకి వచ్చామని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 4 పార్లమెంట్ స్థానాలు గెలిచి ఉత్తర తెలంగాణలో బలపడ్డామని, తెరాసకు ప్రత్యామ్నాయంగా భాజపా రూపాంతరం చెందుతోందని చెప్పారు.
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కనుమరుగైందనీ.. సీఏఏను అడ్డుపెట్టుకొని దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతోందని లక్ష్మణ్‌ మండిపడ్డారు. మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చాక దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపుతున్నారన్నారు. ఎన్‌పీఆర్‌ చేస్తే తప్పన్నట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ సమగ్ర కుటుంబ సర్వే చేస్తే ఒప్పు.. అదే భాజపా చేస్తే తప్పా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, తెరాస, కమ్యూనిస్టులు, మజ్లిస్ అన్నీ ఒక్కటేనని వ్యాఖ్యానించారు. ఇటీవల కాంగ్రెస్‌పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. 2020ని పోరాటాలు, ఉద్యమాల సంవత్సరంగా పరిగణిస్తామని లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో పోటీ చేస్తామని చెప్పారు. ఈ నెల 7న దిల్లీలో భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో మోత్కుపల్లి నర్సింహులుతో పాటు కరీంనగర్‌ జిల్లాకు చెందిన తెరాస ముఖ్యనేతలు భాజపాలో చేరుతున్నారనీ.. చేరికల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని లక్ష్మణ్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *