రెండేళ్లుగా సహజీవనం చేస్తూ పెళ్లి చేసుకొమ్మంటే పిట్ట కథలు చెబుతూ వాయిదా వేస్తున్న  ప్రియుడిపై కత్తితో దాడి చేసి ఆపై ప్రియురాలు కూడా నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటన కృష్ణ జిల్లా  అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మచిలీపట్నంకు చెందిన మాగంటి నాగలక్ష్మి ఓ ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తుంది. గూడూరుకు చెందిన గొరిపర్తి పవన్‌కుమార్‌ పెడన తహసీల్దార్‌ కార్యాలయంలో ఔట్‌ సోర్సింగ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. రెండేళ్లుగా వీరిద్దరి మధ్య పరిచయం ఉండగా, ఇటీవల వక్కలగడ్డ గ్రామంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు.ఈ క్రమంలో నిన్న సాయంత్రం  యువతీ యువకులు ఇద్దరూ అపస్మారకస్థితిలో పడి ఉన్నారు. యువకుడి శరీరంపై కత్తిపోట్లు ఉండడంతో గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కొంత కాలంగా తనను వివాహం చేసుకోవాలని నాగలక్ష్మి ఒత్తిడి చేయడంతో ఆ ప్రతిపాదనను అతను తిరస్కరిస్తూ వచ్చాడు. ఇంట్లో ఒప్పుకోరని ప్రియుడు వాదించడంతో ఒకసారి కలిసి మాట్లాడుకుందామని చెప్పి సోమవారం మధ్యాహ్నం చల్లపల్లి మండలం వక్కలగడ్డలోని తనకు తెలిసిన యువతి ఇంటికి తీసుకెళ్లింది. మళ్లీ తనను పెళ్లి చేసుకోవాలని గొడవకు దిగింది. పవన్‌కుమార్‌ ఒప్పుకోకపోవడంతో ఒక్కసారిగా కత్తి తీసి అతనిపై దాడికి పాల్పడింది. ఆపై తానూ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గదిలో వినిపిస్తున్న కేకలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

కాగా ఆసుపత్రిలో యువకుడు మాట్లాడుతూ పెళ్లి చేసుకోవాలంటూ ఆమె గత కొన్నాళ్లుగా తనను ఒత్తిడి చేస్తోందన్నాడు. మాట్లాడుకుందామంటే గ్రామానికి వచ్చానని, పెళ్లి చేసుకుని కలిసి బతుకుదామని, లేదంటే కలిసి చనిపోదామని చెబుతూ తనపై కత్తితో దాడిచేసిందని వివరించాడు. ఆ తర్వాత ఆమె నిద్రమాత్రలు మింగిందని పేర్కొన్నాడు. 


దీంతో చల్లపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న నాగలక్ష్మినీ, గాయాలతో ఉన్న పవన్‌కుమార్‌ను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నాగలక్ష్మి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మెరుగైన వైద్యం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సీఐ ఎన్‌.వెంకట నారాయణ, ఎస్‌ఐ పి.నాగరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.యువతి స్పృహలోకి వస్తే కేసు ఓ కొలిక్కి వస్తుందని పోలీసులు భావిస్తున్నారు.

You Might Also Like