కరోనా వైరస్‌ను ఎదురుకుని జయించినవారు మనకు స్ఫూర్తిప్రదాతలని  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం ఆయన మన్‌ కీ బాత్‌లో మాట్లాడుతూ వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే దేశ ప్రజలు కొన్ని రోజులు లక్ష్మణ రేఖ దాటొద్దని వ్యాఖ్యానించారు.లాక్‌డౌనే కరోనా వైరస్‌ నివారణకు పరిష్కార మార్గమని మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రజల ప్రాణాలకే ముప్పుని, కరోనా వైరస్‌ను జయించినవారు మనకు స్ఫూర్తిప్రదాతలని ప్రధాని వ్యాఖ్యానించారు. కరోనా మానవత్వానికి సవాల్‌ విసురుతోందని, కరోనాపై గెలవాలంటే కఠిన నిర్ణయాలు తప్పవన్నారు. అందరూ ఏకమై కరోనాపై యుద్ధం చేయాలని పిలుపు ఇచ్చారు.

ప్రభుత్వ నిబంధనలు, స్వీయ నియంత్రణ పాటించాల్సిదేనన్నారు.ఈ సందర్దంగా దినసరి కూలీలు పడుతున్న కష్టాన్ని తాను అర్థం చేసుకున్నానని అన్నారు. ప్రపంచ పరిస్థితులు చూశాకే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఇది జీవన్మరణ పోరాటమన్నారు. రోగం వచ్చినప్పుడే చికిత్స చేయాలి, లేదంటే ఇబ్బందులొస్తాయన్నారు. ఎవరికో సాయం చేసేందుకు లాక్‌డౌన్‌లో పాల్గొనడంలేదని, ప్రజల రక్షణ కోసమే దేశంలో లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు.

కరోనా ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైనది కాదని, కొందరు ఇప్పటికీ సీరియస్‌నెస్‌ను అర్థం చేసుకోవడంలేదని అన్నారు. ప్రజలు నిబంధనలు బేఖాతరు చేస్తే ఇతరులకు ఇబ్బంది తప్పదని మోదీ వ్యాఖ్యానించారు.ఈ క్రమంలో ప్రతిఒక్కరూ ధైర్యంతో కరోనాపై పోరాడాలని పిలుపుఇచ్చారు. కరోనా వైరస్‌ కట్టడికి వైద్యులు, నర్సులు ఇతర వైద్య సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమని మోదీ వ్యాఖ్యానించారు.

కరోనాపై పోరులో భాగంగా లాక్‌డౌన్‌ వంటి అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తనను క్షమించాలని వ్యాఖ్యానించారు. తనపై కొందరు ఆగ్రహంతో ఉన్నారని తనకు తెలుసని అన్నారు. అయినప్పటికీ, కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఈ కఠిన చర్యలు తీసుకోకతప్పదని చెప్పారు.


 

You Might Also Like