కరోనా తో మృతి చెందిన కన్నతల్లి కి అంతిమ సంస్కారాలు చేయడానికి నిరాకరించాడో ప్రబుద్దుడు.  నవ మాసాలు మోసి, పెంచి పెద్ద చేసిన తల్లి చనిపోగా ఆమె మృత దేహాన్ని తీసుకోవడానికి కూడా కుమారుడు నిరాకరించిన ఈ అమానవీయ ఘటన పంజాబ్ లోని లూధియానాలో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళ్తే షిమ్లాపురి గ్రామానికి చెందిన 69 ఏళ్ల వృద్ధురాలిని కరోనా లక్షణాలతో మార్చి 31న ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించారు. గత ఆదివారం ఆమె కరోనా రక్కసి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఆమె మృత దేహాన్ని  తీసుకెళ్లాలని జిల్లా అధికారులు ఆమె కుమారుడిని కోరారు. అయితే ఆమె శవాన్ని తీసుకెళ్లేందుకు కుమారుడు కానీ, బంధువులు కానీ రాలేదు. దీంతో అధికారులు షాక్ కు గురయ్యారు.


ఈ నేపథ్యంలో, అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఇక్బాల్ సింగ్ మాట్లాడుతూ, డెడ్ బాడీ నుంచి ఇన్ఫెక్షన్ సోకకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చిన  ఆమె కుమారుడు కానీ, బంధువులు కానీ రాలేదని చెప్పారు. ఆమె కుటుంబ సభ్యులను అధికారులు రెండు సార్లు సంప్రదించారని... అయినా వారు ముందుకు రాలేదని తెలిపారు. ఇది తమను షాక్ కు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు చేసేదేమీ లేక... నిన్న అర్ధరాత్రి జిల్లా అధికారులే అంత్యక్రియలను నిర్వహించారని చెప్పారు. మృతురాలి కుమారుడు, బంధువులు అంత్యక్రియలను 100 మీటర్ల దూరం నుంచి వీక్షించారని తెలిపారు.

You Might Also Like