కరోన వ్యాప్తి తో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ తో ఉపాధి లేక స్వస్థలాలకు వెళ్లాలనుకున్న  వలస కూలీలను మృత్యువు వెంబడించింది.తమ గ్రామాలకు వెళ్లేందుకు  రైల్వే స్టేషన్కు   చేరుకుని రైలు కోసం  ఎదురు చూస్తున్న కూలీలకు గూడ్స్ రైల్ రూపం లో ప్రమాదం ముంచుకు వచ్చి 14  మంది ప్రాణాలను కబళించింది. హృదయ విదారకమైన ఈ ఘటన పై సెంట్రల్ రైల్వే (ఎస్సీఆర్) చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (సిపిఆర్ఓ) అందించిన వివరాలు  ఇలా ఉన్నాయి.మహారాష్ట్రలోని ఔరంగబాద్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది.


కర్మాడ్‌   స్టేషన్‌ సమీపం లోని ట్రాక్‌పై నిద్రిస్తున్న వలస కూలీలపై ఖాలిగా వస్తున్న గూడ్స్‌ రైలు దూసుకెళ్లింది. ఈప్రమాదంలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో, ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. మృతులంతా మధ్యప్రదేశ్‌కు వెళ్లేందుకు అక్కడికి చేరుకున్న వలస కార్మికులుగా గుర్తించారు.రైల్ కోసం ఎదురు చూస్తూ  పట్టాలపై నిద్రిస్తున్న వారిని గూడ్స్ రైలు వేగంగా ఢీకొనడంతో మృతదేహాలు పట్టాలపై చె ల్లాచెదురుగా పడి ఉండగా భాదిత కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతం విషాదం గా మారింది.


కర్మాడ్‌ పోలీసులు ,స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వలస కార్మికులు గూడ్స్‌రైలు రాకను గమనించకపోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికం గా నిర్థారించారు. ఆర్పీఎఫ్‌, రైల్వే ఉన్నతాధికారులు ఘటనాస్థలికి బయల్దేరారు.గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు.

You Might Also Like