ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టుకోలేడని అంటారు...అలాంటి ఈశ్వరుని గుడికే కన్నమేస్తే ఇంకెవరు పట్టుకుంటారనే ధీమాతోనే ఆ ఆలయ సిబ్బంది చేతివాటం చూపెట్టారు. జ్యోతీర్లింగ స్వరూపుని దేవాలయం లోనే చీకటి రాజ్యం తయారుచేసుకున్న అక్రమార్కులు అందిన కాడికి దండుకున్నారు.ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం లో భారీ స్కామ్ చోటుచేసుకుంది. బోళా శంకరుని ఆదాయానికి  సాక్షాత్తు ఆలయ సిబ్బందే తమ చేతి వాటంతో అడ్డగీతలు పెట్టి  జేబులు నింపుకున్నారు. భ‌క్తులు వివిధ రూపాల‌లో చెల్లించిన  రూ.5 కోట్ల వరకు  స్వాహా చేశారు.

ప్రసిద్ధ పుణ్య  క్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం లో రూ.5 కోట్ల వరకు గోల్మాల్ జరిగింది. అక్రమార్కులు శ్రీఘ్రదర్వనాలు, అభిషేకం టికెట్లు, కంకణాలు, మహా మంగళహారతి టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని  ఆన్లైన్లో తప్పుడు సమాచారమిచ్చి తమ జేబులు నింపుకున్నారు.ఆలస్యంగా బయట పడ్డ ఈ స్కామ్ పై ఆలయ ఈ.ఓ  రామారావు ను వివరణ కోరగా స్కామ్ జరిగింది నిజమేనని అయితే ఎంత వరకు దండుకున్నారని విషయం తానూ నిక్కచ్చిగా చెప్పలేనన్ని తెలిపారు.

అయన తెలిపిన వివరాల ప్రకారం దేవాలయ సిబ్బంది  150 రూపాయల శ్రీఘ్రదర్శనంలో సుమారు కోటి రూపాయలను, 15 వందల అభిషేకం టికెట్లలో 50 లక్షలను, వసతి గృహాల కేటాయింపులో  మరో 50 లక్షలను కాజేశారు. టోల్ గేట్ పెట్రోల్ బంకుల నిర్వహణలో మరో రూ.40 లక్షలు, 500 రూపాయల టిక్కెట్లు, కంకణాలు, మహా మంగళహారతి టికెట్లలో మరో 50 లక్షల రూపాయలు దుర్వినియోగం జరిగినట్లు  తమ విచారణలో తేలిందన్నారు.దీనికోసం ఏకంగా ఆల‌యంలో ఉప‌యోగిస్తున్న సాఫ్ట్ వేర్ నే సిబ్బంది మార్చేసారని , అభియోగం తమ మీదికి రాకుండా సదరు అక్రమార్కులు టికెట్ కౌంటర్లలో కాంట్రాక్టు ఉద్యోగులను నియమించారని చెబుతున్నారు.

ఈ విషయం  లో విచారణ జరిపిన తమకు నిజాలు బయట పడ్డాయని ,మొత్తానికి దేవాలయం లో భారీ ఎత్తున అవినీతి జరిగింది వాస్తవమేనని , మొత్తం ఎంత జరిగింది అనేదానిపై ఇంకా పూర్తి నివేదిక రాలేదన్న ఆయన సిబ్బంది నుండి పోయిన డబ్బును రికవరీ చేసే ప్రయత్నంలో ఉన్నామని ఈ విషయం మీద ప్రభుత్వానికి కూడా నివేదిక అంద‌జేయ‌నున్నామ‌ని ఈ.ఓ రామారావు  తెలిపారు.

You Might Also Like