చికిత్సకు డబ్బుల్లేక మాజీ ఎమ్మెల్యే కొడుకు  ప్రాణాలు విడిసిన ఘటన  ఇది..ఒక్కసారి కౌన్సిలర్ గెలిస్తేనే చేతినిండా డబ్బులు సంపాయించే కాలమిది .అలాంటిది ఓ మాజీ ఎమ్మెల్యే కొడుక్కు డబ్బులేక ఇలా జరిగిందా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు  నమ్మలేని సంఘటన అయినా ఇది నిజం. ఈ హృదయ విదారకపు ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేటకు చెందిన కర్రెళ్ల నర్సయ్య స్వాతంత్య్ర సమరయోధుడు. ఆయన 1957 నుంచి 1962 వరకు అప్పటి నేరేళ్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పని చేశాడు.

ఆయన పని చేసినంత కాలం నీతి,నిజాయితిగా ఉండి ప్రజా సేవకు అంకితమయ్యాడు. ఆయన అనారోగ్య సమస్యలతో 15 సంవత్సరాల క్రితం మరణించాడు. ఆయన కుమారుడు ఆనందానికి ప్రస్తుతం 48 సంవత్సరాలు. సుతారి పని చేస్తూ బతుకు లాగదీస్తున్నాడు. ఆయనకు కొంత కాలం క్రితం కడుపులో కణుతులు ఉన్నాయని తేలింది. అప్పటి నుంచి చికిత్స చేయించుకుంటున్నాడు. రూ.3 లక్షలు అప్పుచేసి ఆపరేషన్ కూడా చేయించుకున్నాడు. అయినా అతని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. ఇటీవల మళ్లీ ఆస్పత్రికి వెళ్లగా చికిత్సకు మరో లక్ష రూాపాయలు కావాలని డాక్టర్లు తెలిపారు. దీంతో పైసలు లేక వైద్యం చేయించుకోలేదు. చివరికి పరిస్థితి విషమించి బుధవారం ఇంట్లోనే మరణించాడు. ఆనందానికి భార్య అనిత,ఇద్దరు పిల్లలు లెనిన్,మధు ఉన్నారు. వారి దీనస్థితి చూసి అంతా కన్నీరు మున్నీరవుతున్నారు. మాజీ ఎమ్మెల్యే కొడుకు అయినా చివరకు దుస్థితిలో మరణించాడని అంతా విచారం వ్యక్తం చేశారు.

You Might Also Like