లండన్ నుంచి హైదరాబాద్ తిరిగొచ్చిన ఓ డీఎస్పీ కుమారుడి (23)కి కరోనా పాజిటివ్ అని తేలడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలకలం రేగింది.కొత్తగూడెం పట్టణానికి చెందిన ఓ పోలీసు అధికారి కుమారుడు లండన్‌లో చదువుతున్నాడు. ప్రపంప వ్యాప్తంగా కరోనా విజృంభణ నేపథ్యంలో అక్కడి యూనివర్సిటీ మూసివేయడంతో ఆ విద్యార్థి ఇటీవల కొత్తగూడెం చేరుకున్నాడు. ఆ తర్వాత జలుబు, దగ్గు, జ్వరం రావడంతో కుటుంబసభ్యులు వెంటనే వైద్య అధికారులను సంప్రదించారు. ప్రాథమిక పరీక్షలు చేసిన వైద్యులు కరోనా లక్షణాలున్నట్టుగా గుర్తించి వెంటనే అత్యవసర వాహనంలో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ విద్యార్థికి వైద్య పరీక్షలు నిర్వహించి అతడికి కరోనా లక్షణాలున్నట్లుగా నిర్ధారించారు.


దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. అంతకు ముందు అశ్వాపురం మండలానికి చెందిన ఓ విద్యార్థిని ఇటలీ లో మెడిసిన్‌ చదువుతూ స్వగ్రామానికి వచ్చింది. ఈ క్రమంలో ఆమెకు దగ్గు, జలుబు, తుమ్ములు, జ్వరం రావడంతో వైద్య శాఖాధికారులు గాంధీ ఆస్పత్రికి పంపించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమెకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు ధ్రువీకరించడంతో.. జిల్లాలో మొదటి కేసు నమోదైంది. ఇక ప్రస్తుతం కొత్తగూడేనికి చెందిన లండన్‌ విద్యార్థికి కరోనా లక్షణాలు ఉన్నట్టు గుర్తించడంతో రెండో కేసుగా నమోదు చేశారు.


అతడితోపాటు కుటుంబ సభ్యులు మొత్తాన్ని వెంటనే గాంధీ ఆసుపత్రిలోని క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. లండన్‌లో చదువుకుంటున్న యువకుడు ఈ నెల 18న హైదరాబాద్ వచ్చాడు. అనంతరం కారులో కొత్తగూడెం వెళ్లాడు. 20వ తేదీ వరకు అక్కడ ఇంట్లోనే ఉన్నాడు. ఈ సందర్భంగా కొందరు బంధుమిత్రులను కూడా కలిశాడు. 20న దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపించడంతో వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అదే రోజు అంబులెన్స్‌లో హైదరాబాద్ తరలించారు. నిన్న అతడికి సంబంధించిన రిపోర్టులు రాగా, కరోనా పాజిటివ్ అని వచ్చింది.


డీఎస్పీ కుమారుడికి కరోనా పాజిటివ్ అని తేలడంతో పోలీసు శాఖలోనూ ఆందోళన మొదలైంది. డీఎస్పీకి కూడా కరోనా సోకే ఉంటుందని భావిస్తున్నారు. ఆయన కుటుంబం, వారితో సన్నిహితంగా ఉంటున్న వారిని గుర్తించేందుకు వైద్యాధికారులు రంగంలోకి దిగారు. మరోవైపు, బాధిత యువకుడిని తీసుకెళ్లిన కారు డ్రైవర్ సొంతూరు వెళ్లినట్టు తెలియడంతో అక్కడి వారిలోనూ ఆందోళన మొదలైంది.

You Might Also Like