మంత్రులు ,ప్రజా ప్రతినిధులు అధికారులు, సిబ్బంది ఎంత ప్రయత్నించినా బాలుని ప్రాణాలు నిలవలేదు.బోరు బావిలో బాలుడు పడిన అరగంట వ్యవధిలోనే అన్ని ఏర్పాట్లు చేసి అప్రమత్తమైన జిల్లా యంత్రాంగము ఆ బాలుడి మరణాలన్నీ ఆపలేకపోయారు.వెరసి బుడి బుడి అడుగులు వేస్తూ తాత చేయిపట్టుకుని ఆడుకుంటూ నడుస్తూ బోరులో పడ్డ బాలుని ప్రాణాలు గాలి అందక అదే  గాలిలో కలిసిపోగా ఆ తల్లికి కడుపుకోత మిగిలింది.  మెదక్‌ జిల్లా పాపన్న పేట మండలం పొడ్చన్‌పల్లిలో బుధవారం సాయంత్రం బోరుబావిలో పడిన బాలుడు ఘటన విషాదాంతమైంది.‌ 17 అడుగుల లోతు నుంచి గురువారం ఉదయం 5.45 గంటల సమయంలో బాలుడి మృతదేహాన్ని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వెలికితీశాయి. ఆక్సిజన్‌ అందకపోవడం వల్లే బాలుడు మృతి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని మెదక్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు.


నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే స్పందించిన స్థానికులు 108కి  సమాచారం అందించారు. 108 సిబ్బంది వెంటనే ఆక్సిజన్‌ పైపులోనికి పంపి బాలుడిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. 150 అడుగుల లోతు ఉన్న బోరుబావిలో సాయివర్థన్‌ 25 అడుగుల లోతున ఉండొచ్చని భావించి.. బావికి సమాంతరంగా పొక్లెయిన్లతో మరో గొయ్యి తవ్వి దాదాపు 8.30 గంటల పాటు సహాయక బృందాలు శ్రమించినా ఫలితం లేకపోయింది. అప్పటికే సాయివర్ధన్‌ ప్రాణాలు కోల్పోయాడు.


బాలుడి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టరు ధర్మారెడ్డి, ఎస్పీ చందనాదీప్తి, ఆర్డీవో సాయిరాం సహాయక చర్యలు పూర్తయ్యే వరకు సంఘటన స్థలంలోనే ఉండి పర్యవేక్షించారు. బోర్లు విఫలమైతే వెంటనే పూడ్చివేయాలని రైతులకు ఎమ్మెల్యే సూచించారు. అనుమతి లేకుండా బోర్లు వేసిన రిగ్గు యజమానిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ వెల్లడించారుYou Might Also Like