ఒక వైపు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే, మరోవైపు సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని సమరం సాగించిన సామాజిక విప్లవ యోధుడు బాబూ జగ్జీవన్‌ రామ్‌ అని జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్ అన్నారు .మాజీ ఉప ప్రధాని, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగ్జీవన్ రామ్ 113వ జయంతి ఉత్సవాలు కలెక్టరేట్ లో ఆదివారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి శ్రీ కృష్ణ భాస్కర్,ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే ముఖ్య అథితులుగా హాజరై బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో బడుగు , బలహీన వర్గాల సాధికారతకు కృషి చేసిన మహనీయుడు బాబూ జగ్జీవన్ రామ్ అని అన్నారు.దేశ రాజకీయ యవనికపై జగ్జీవన్ రామ్ చెరగని ముద్రవేశారని కొనియాడారు. ఇవాళ దేశంలో బడుగు, బలహీన వర్గాలు అనేక సదుపాయాలను పొందగలుగుతున్నారంటే జగ్జీవన్‌రామ్ స్ఫూర్తిగా అమలు జరుగుతున్న విధానాలవల్లనే అని కలెక్టర్ పేర్కొన్నారు. 

జగ్జీవన్ రామ్ ఎస్సీ, ఎస్టీల ప్రగతికి చోదకశక్తిలా నిలిచారని చెప్పారు. ఆయన ఐదు దశాబ్దాలు చట్టసభల సభ్యుడుగా, మూడు దశాబ్దాలకు పైగా కేంద్రమంత్రిగా వివిధ కీలక శాఖల బాధ్యతలు నిర్వర్తించారని చెప్పారు. కేంద్ర వ్యవసాయ, ఆహార మంత్రిగా దేశంలో హరిత విప్లవానికి సానుకూల పరిస్థితులు ఏర్పరచి ఆహార సమస్య పరిష్కారానికి కృషిచేశారని కలెక్టర్ అన్నారు.జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ భారతదేశాన్ని అభివృద్ధి నడిపించిన ఘనత దేశ మాజీ ఉప ప్రధాన మంత్రి బాబు జగ్జీవన్ రామ్‌కు దక్కిందని అన్నారు. స్వాతంత్రానంతరం భారతావనికి దిశా నిర్దేశం చేసిన ఉప ప్రధానిగా ఆయన చరిత్ర మరిచి పోలేనిదని అన్నారు.

దేశ ప్రజల సంక్షేమం కోసం వారి శ్రేయస్సు కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టిన మహనీయులలో బాబు జగ్జీవన్ ఒకరని కొనియాడారు. మహాత్మగాంధితో కలిసి క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా గుర్తుచేసారు. కేంద్ర కేబినెట్ మంత్రిగా కొంతకాలం పనిచేసిన తరువాత భారత ఉప ప్రధానిగా నియమితులవడం భారత దేశ ప్రజలు చేసుకున్న అదృష్టంగా ఎస్పి అభివర్ణించారు. జీవితమంతా దేశ సేవకు అంకితం చేసిన బాబు జగ్జీవన్ రామ్ నవభారత నిర్మాణంలో సుమారు నలబై సంవత్సరాల పాటు తీవ్రంగా శ్రమించారని గుర్తుచేసారు. పార్లమెంట్ సమావేశాలలో తన అనర్గళమైన ప్రసంగాలతో ప్రత్యర్థులను సైతం కట్టి పడేవాడని అన్నారు. ప్రజల సంరక్షణార్థం అనేక చట్టాలను పార్లమెంట్ సభ్యుల చేత ఆమోద ముద్ర వేయించడంలో బాబు జగ్జీవన్ పాత్ర అతి ముఖ్యమైనదిగా ఎస్పీ పేర్కొన్నారు. 


అదనపు కలెక్టర్ శ్రీ అంజయ్య మాట్లాడుతూ బాబూ జగ్జీవన్ రామ్ జీవితమంతా దేశసేవకు అంకితం చేసి నాలుగు దశాబ్దాలు నవభారత నిర్మాణంలో కీలకపాత్ర పోషించారని అన్నారు. ఆయన అత్యవసర పరిస్థితిని ఎదిరించి జైలుకెళ్లారని, ఎస్సీల హక్కులను రాజ్యాంగంలో అంబేడ్కర్‌ పొందుపరిస్తే వాటిని చట్ట రూపంలో అమలుచేయడానికి జగ్జీవన్‌ రామ్‌ చేసిన కృషి మరపురానిది ఆయన పేర్కొన్నారు. జయంతి వేడుకలలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారిణి శ్రీమతి రాజేశ్వరి , కలెక్టరేట్ AO శ్రీ బి గంగయ్య,సిరిసిల్ల మున్సిపల్ కమీషనర్ శ్రీ సమ్మయ్య, DPRO శ్రీ మామిండ్ల దశరథం, DMHO శ్రీ.చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

You Might Also Like