మర్కజ్‌పార్థనలకు యువకులు వెళ్లి రాకపోతే  జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా ఉండేది కాదని, కరోనాకు ఒక ఫార్ములా అంటూ లేదని సోకకుండా చూసుకోవడమే మేలని  మంత్రి కేటీఆర్‌ చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బుధవారం ఆయన ఆకస్మికంగా పర్యటించారు. ముస్తాబాద్‌ మండలం గూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కేటీఆర్‌ తనిఖీ చేశారు. ఆ తర్వాత వేములవాడలో రెడ్ జోన్ కంటైన్‌మెంట్‌ ప్రాంతంలో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు.అయన అక్కడ తిరుగుతూ ఆ ఏరియా వారిని  పలకరిస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు తెలిపారు.వేములవాడలో కరోనా సోకిన యువకుడి పరిస్థితి ప్రస్తుతం బాగున్నట్లు గాంధీ ఆస్పత్రి వైద్యులు తెలిపారన్నారు. ఆ యువకుడితో సన్నిహితంగా మెలిగిన 21 మందిని క్వారంటైన్‌ కేంద్రానికి తరలించినట్లు మంత్రి వివరించారు. వేములవాడలో ఒక్క కేసు మాత్రమే నమోదైందని కంటైన్‌మెంట్‌ ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా సహకరించాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. పలుచోట్ల స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. కరోనా నివారణకు స్వీయ నియంత్రణే మందు అని రానున్న రెండు వారాలు కూడా ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 

You Might Also Like