ప్రస్తుతం ఉన్నట్లుగానే తెలంగాణ ప్రజలు క్రమశిక్షణతో మెలిగి కరోనాను పారదోలగలిగితే రాష్ట్రంలోకొత్త కేసులు నమోదు అయ్యే అవకాశం లేదని ఇక్కడ అసలు కరోనా బాధితులే ఉండరని దీనితో ఏప్రిల్‌ 7 తర్వాత కరోనా ఫ్రీ తెలంగాణా అవుతుందని  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు తెలంగాణ లో  70 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వెల్లడించారు.ఇందులో  చికిత్స పొందిన 11మంది కరోనా బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నట్లు తెలిపారు.మరో 58 మంది పరిస్థితి నిలకడగా ఉందని, వారిని కూడా పరిస్థితులను బట్టి విడతల వారీగా డిశ్చార్జి చేస్తామని వివరించారు.

చికిత్స పొందుతున్న వారందరూ బాగానే కోలుకుంటున్నారని తెలిపారు. మొత్తం 25,935 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, వారిలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవని అన్నారు. క్వారంటైన్‌లో ఉన్న వారిని 5,742 బృందాలు పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు.విదేశాల నుంచి రాకపోకలను పూర్తిగా స్తంభింప చేశామని, కేంద్రం కూడా విమానాశ్రయాలు, పోర్టులన్నీ మూసివేసిందని తెలిపారు. అందువల్ల కొత్త కేసులు నమోదయ్యే అవకాశం చాలా తక్కువని సీఎం అన్నారు. రాష్ట్రంలోనూ కొత్త కేసులు నమోదు కాకపోతే ఏప్రిల్‌ 7 తర్వాత కరోనా బాధితులే ఉండరని చెప్పారు.

కరోనా వ్యాధిని నివారించడం పట్ల 130 కోట్ల జనాభా ఉన్న భారత్‌ తెలివిగా వ్యవహరించిందని అంతర్జాతీయంగా ప్రశంసలు వస్తున్నాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రంలోనూ ఇప్పటి వరకూ అందరూ సహకరిస్తున్నారని, ఇదే స్పూర్తిని కొనసాగించాలని కోరారు. గండం నుంచి గట్టెక్కినట్లేని ఇప్పుడే సంబరపడవద్దని సీఎం హితవు పలికారు.

ఏ క్షణంలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియదని, అందువల్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ ఉన్నంతకాలం స్వీయనిర్భందంలో ఉండాలని కోరారు.రైతులకు మరో సారి పండిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అయన భరోసా ఇచ్చారు.మార్కెట్ కమిటీలకు ధాన్యం అమ్మకానికి గుంపులుగా రావొద్దని అలా వస్తే ఇన్ని రోజులుగా వైరస్ ను దూరం ఉంచిన ప్రయోజనం ఉండదని అయన హెచ్చరించారు.

You Might Also Like