ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా వ్యాధి సోకిన ఘటన మెదక్ జిల్లాలో కలకలం రేపింది.  మెదక్‌ పట్టణంలోని ఆజంపురకు చెందిన 56 ఏళ్ల వ్యక్తి దిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌కు వెళ్లి గతనెల 21న స్వస్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత అతడ్ని వైద్య పరీక్షల నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి పంపి నమూనాలు పరీక్షించగా పాజిటివ్‌గా తేలింది. దీంతో అప్రమత్తమైన వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు అతడి కుటుంబసభ్యులందరికీ బుధవారం మెదక్‌లోని ప్రాంతీయ ఆస్పత్రిలో నమూనాలు సేకరించి నిర్ధారణ కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి పంపారు. 


శుక్రవారం అక్కడి నుంచి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు నివేదిక అందింది. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి భార్య, కుమార్తె, కోడలికి ఈ కరోనా సోకినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయిందని మెదక్‌ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి వెంకటేశ్వర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి చెందిన 12 మంది కుటుంబసభ్యులను గత రెండు రోజులుగా పాపన్నపేట మండలం ఏడుపాయల హరితహాటల్‌లోని ప్రభుత్వ క్వారంటైన్‌లో వసతి కల్పించారు. వీరిలో ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వారిని శుక్రవారం సాయంత్రం చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. 

You Might Also Like