మర్కజ్ నుంచి వచ్చిన వారికి, వారి బంధువులకు నిర్వహించిన పరీక్షల్లో 15 మందికి ‘కరోనా’ పాజిటివ్ గా నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఓ ప్రకటన విడుదల లో తెలిపారు. ప్రస్తుతానికి యాక్టివ్ పాజిటివ్ కేసులైన 77 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. మర్కజ్ వచ్చిన వారందరూ గాంధీ హాస్పిటల్ లో పరీక్షలు చేయించుకునేందుకు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ నిన్న విజ్ఞప్తి చేసిందని  చెప్పారు. ‘కరోనా’ లక్షణాలు ఉన్న వారు వారి బంధువులను కూడా పరీక్షల నిమిత్తం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

డయాలసిస్, తలసేమియా, సికెల్ సెల్ జబ్బులున్న వారికి రక్తమార్పిడి అవసరమవుతుంది కనుక వీరు ప్రయాణించడానికి వెసులుబాటు కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని, వీరిని అడ్డుకోవద్దని పోలీసులకు తెలియజేస్తున్నట్టు తెలిపారు. గర్భిణీ స్త్రీలకు ఇబ్బందులు లేకుండా మదర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్లు పనిచేస్తాయని చెప్పారు. కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, ప్రజలు ఇంట్లోనే ఉండి సహకరించాలని ఆ ప్రకటనలో కోరారు. 

You Might Also Like