దేశం మొత్తం మీద రైతులు పండించిన మొత్తం వరి ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణా అని రాష్ట్ర మంత్రి శ్రీ కే తారకరామారావు తెలిపారు.కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులకు లోనయినప్పటికీ రాష్ట్రంలోని రైతన్నలకు ఏలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరతో రైతులు పండించిన ధాన్యం గింజలు కొనుగోలు చేసేందుకు నిధులు విడుదల చేసిందని మంత్రి గుర్తు చేశారు.కరోనా వైరస్ ప్రభా విపత్కర పరిస్థితుల్లో రైతుల శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు రైతన్నలు అన్ని విధాలుగా మద్దతుగా నిలబడాల నీ మంత్రి శ్రీ కే తారక రామారావు పిలుపునిచ్చారు . రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.


రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంలో కంటే రెట్టింపు ధాన్యం దిగుబడి వచ్చినప్పటికీ ఆ మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 212 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని మంత్రి తెలిపారు.డిమాండ్ ను బట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెస్తున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు 206 దాన్యం కొనుగోలు కేంద్రాలను, 3 మక్కల కొనుగోలు కేంద్రాలను జిల్లావ్యాప్తంగా తెరిచామని మంత్రి పేర్కొన్నారు. కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో రైతుల రద్దీని తగ్గించేందుకు గ్రామ స్థాయి లోనే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు.


జిల్లాలో ఇప్పటివరకు 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశామన్నారు.కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లాలో వెయ్యికి పైగా సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి ధాన్యం కొనుగోలు ప్రక్రియ లో భాగస్వామ్యం అయ్యారని మంత్రి పేర్కొన్నారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. చెల్లింపులు వేగంగా చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తుందన్నారు.

ఎండాకాలంవరి పంటకు ప్రారంభంలో అగ్గితెగులు ,మెడ విరుపు వ్యాధులు రావడం వల్ల గతంలో కంటే ఎక్కువ ధాన్యంలో తాలు కనిపిస్తోందన్నారు. దానివల్ల దాన్యం కొనుగోలు కేంద్రాలలో అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయని మంత్రి తెలిపారు.తాలు ఎక్కువగా ఉండటంవల్ల రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలుకు ముందుకు రావడం లేదన్నారు.అయినప్పటికీ వారితో చర్చించి ధాన్యం కొనుగోలుకు వారిని ఒప్పిం చామాని అని మంత్రి తెలిపారు.రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇంత కృషి చేస్తున్నప్పటికీ అక్కడ అక్కడ దాన్యం కొనుగోలు కేంద్రాలలో అవాంఛనీయ సంఘటనలు జరగడం బాధాకరమన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే రైతులు సంబంధిత అధికారుల దృష్టికి ,స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి, రైతు సమన్వయ సమితి సభ్యుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం పొందాలన్నారు అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యలను తీసుకెళ్లాలి అన్నారు. సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి అన్నారు.You Might Also Like