సాగునీటి వసతి పెరుగుతున్నందున రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరిసాగు జరుగుతున్నదని, తెలంగాణ రాష్ట్రం రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారుతున్నదని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు వెల్లడించారు. పంటల విస్తీర్ణం, దిగుబడి పెరుగుతున్నందున, పండిన పంటలకు సరైన ధర వచ్చేందుకు అవసరమైన సమగ్ర వ్యూహాన్ని ఖరారు చేస్తున్నట్లు వెల్లడించారు. అదనంగా మరో 40 లక్షల టన్నుల నిల్వ సామర్ధ్యం కలిగిన గోదాములు, 2500 రైతు వేదికలు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. రైతుబంధు సమితులను క్రియాశీలం చేసేందుకు అవసరమైన విధానం ఖరారు చేయాలని చెప్పారు. జూన్ నెలకు సంబంధించిన ఎరువులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నందున రైతులు వాటిని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. నకిలీ ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అమ్మే వారి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని సిఎం హెచ్చరించారు.

యాసంగి పంటల కొనుగోలు, వానాకాలం సాగు ఏర్పాట్లు, ఎరువుల లభ్యత, గోదాములు- రైతు వేదికల నిర్మాణం, పంటలకు మద్దతు ధర రాబట్టే విధానం, పౌర సరఫరాల సంస్థ కార్యకలాపాలను విస్తరించడం, రైతుబంధు సమతిలను క్రియాశీలం చేయడం తదితర అంశాలపై ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో ఇవాళ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నిరంజన్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ గంగుల కమలాకర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శి శ్రీ నర్సింగ్ రావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జనార్థన్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, కమిషనర్ శ్రీ సత్యనారాయణ రెడ్డి, సిఎంఓ కార్యదర్శి శ్రీమతి స్మితా సభర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో మెరుగైన రైతుల పరిస్థితి
------------------------------------------
‘‘తెలంగాణ జీవిక వ్యవసాయానికి అనుబంధమై ఉన్నది. 60-65 లక్షల మంది రైతులున్నారు. ఇంకా అనేక మంది వ్యవసాయాన్ని ఆధారం చేసుకుని బతుకుతున్నారు. అసంఘటితంగా ఉండడం వల్ల, గత ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నాలు చేయకపోవడం వల్ల రైతులు ఎంతో వ్యధను అనుభవించారు. వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో రైతు సంక్షేమం- వ్యవసాయాభివృద్ధికి అనేక చర్యలు తీసుకోవడం వల్ల పరిస్థితి కొంత మెరుగైంది. ఇంకా వ్యవసాయాభివృద్ధి కోసం, రైతులకు మేలు చేయడం కోసం కృషి జరగాల్సి ఉంది’’ అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.


పంటలకు మద్దతు ధర కోసం సమగ్ర విధానం
---------------------------------------------------
‘‘తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతాంశంగా తీసుకుని ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం వల్ల గోదావరి, కృష్ణా నదుల్లో రాబోయే రోజుల్లో దాదాపు 1300 టిఎంసిల నీటిని వాడుకునే అవకాశం కలుగుతుంది. మిషన్ కాకతీయ ద్వారా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ, 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా కారణంగా సాగునీటి లభ్యత పెరిగింది. ప్రాజెక్టులు, చెరువులు, బోర్ల ద్వారా కోటి 45 లక్షల ఎకరాల్లో రెండు పంటలు, పది లక్షల ఎకరాల్లో మూడు పంట పండే అవకాశం ఉంది. అంటే ఏడాదికి తెలంగాణలో మూడు కోట్ల ఎకరాల్లో పంట పండుతుంది. ఇందులో ఎక్కువ శాతం వరి పండిస్తారు. ఏడాదికి కోటికి పైగా ఎకరాల్లో వరి పంట సాగయ్యే అవకాశం ఉంది. అప్పుడు తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారుతుంది. ఇప్పుడు పండుతున్న పంటకు రెట్టింపుకన్నా ఎక్కువ దిగుబడులు రాబోయే సంవత్సరాల్లో వస్తాయి. అలా వచ్చిన దిగుబడులకు మద్దతు ధర వచ్చే వ్యూహాన్ని ఖరారు చేయడం మన కర్తవ్యం. వ్యవసాయశాఖ, పౌర సరఫరాల శాఖ, రైతుబంధు సమితి ఈ దిశగా అడుగులు వేయాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

పౌర సరఫరాల సంస్థ ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్
---------------------------------------------------
‘‘ప్రస్తుత కరోనా కష్టకాలంలో రైతులు ఇబ్బంది పడవద్దనే ఉద్దేశ్యంతో దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ గింజా కొంటామని ప్రకటించి, ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. భవిష్యత్తులో కూడా రైతులకు మద్దతు ధర అందాలి. అటు రైతులకు మద్దతు ధర ఇవ్వడంతో పాటు, ప్రజలకు బియ్యం, పప్పుల లాంటి ఆహార దినుసులను తక్కువ ధరల్లో అందించే విధంగా పౌర సరఫరాల సంస్థ తన కార్యకలాపాలను విస్తరించుకోవాలి. ధాన్యం, కందులు, శనగలు, పెసర్లు లాంటివి కొనుగోలు చేసి, వాటిని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా బియ్యం, పప్పులు తదితర వినిమయ సరుకులుగా మార్చి ప్రజలకు అందించాలి. దీని వల్ల అటు రైతులకు మేలు కలుగుతుంది. ఇటు ప్రజలకు తక్కువ ధరల్లో నాణ్యమైన ఆహార దినుసులు లభిస్తాయి. ఈ దిశగా సంస్థ కార్యాచరణ రూపొందించి అమలు చేయాలి’’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు.

వ్యవసాయ శాఖ చెప్పిన పంటే పండించాలి
------------------------------------------------
‘‘రైతులంతా ఒకే పంట వేసే విధానం పోవాలి. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే వేయాలి. ఏ గుంటలో ఏ పంట వేయాలనే విషయం వ్యవసాయ శాఖ నిర్ణయించాలి. రైతులు అవే పంటలు వేయాలి. వేసిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. నియంత్రిత పద్ధతిలో పంటలు వేయాలి. నియంత్రిత పద్ధతిలోనే కొనుగోళ్లు జరగాలి. దీనికోసం అవసరమైతే ప్రస్తుత చట్టంలో మార్పులు తేవడానికి కూడా సిద్ధం. ప్రజలకు అవసరమైన, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను వ్యవసాయశాఖ గుర్తించాలి. ఏ ప్రాంతంలో ఏ పంట సాగు చేయడానికి అనువైనదో నిర్ణయించాలి. రైతులకు మార్గదర్శకం చేయాలి. ఎవరు ఏ పంట వేస్తున్నారో ఖచ్చితంగా రికార్డు చేయాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

మే నెలలోనే రైతులు ఎరువులు కొనుక్కోవాలి
---------------------------------------------------
‘‘సాగు విస్తీర్ణం పెరుగుతున్న కొద్దీ ఎరువులు, విత్తనాలు కూడా గతంలో కన్నా ఎక్కువ సంఖ్యలో కావల్సి వస్తున్నది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నది. ఈ వర్షాకాలంలో 22.30 లక్షల టన్నుల ఎరువులు కావాల్సి ఉంది. వీటిని సకాలంలో రైతులకు అందుబాటులో ఉంచడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్ లో వాడడానికి అవసరమైన ఎరువులు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి రైతులు వాటిని మే మాసంలోనే కొనుగోలు చేయాలి. రైతులంతా ఒకేసారి ఎరువుల దుకాణాల మీద పడకుండా క్రమ పద్ధతిలో కొనుగోలు చేయాలి. ఎఇవోలు రైతులను సమన్వయ పరచాలి’’ అని ముఖ్యమంత్రి సూచించారు.

అదనంగా 40 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన గోదామలు
------------------------------------------------------------------
‘‘టిఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన ఐదేళ్ళలో చేసిన కృషి వల్ల 22.5 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములు రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు అదనంగా మరో 40 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములు నిర్మించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున గోదాము ఉండేలా చూడాలి. ప్రభుత్వ స్థలాల లభ్యతను బట్టి మండల కేంద్రాల్లో కూడా నిర్మించాలి. పాత మండలాల్లో ఇప్పటికే గోదాములు నిర్మాణమైనందున, కొత్తగా ఏర్పాటైన మండలాల్లో ఈ సారి ఖచ్చితంగా గోదాము నిర్మించాలి. పంటలు, ఎరువులు,పిడిఎస్ బియ్యం నిల్వ చేయడానికి గోదాముల అవసరం తో ఉంది, కాబట్టి ఏడెనిమిది నెలల్లోనే గోదాముల నిర్మాణం పూర్తి కావాలి’’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు.

2500 రైతు వేదికల నిర్మాణం
---------------------------------
‘‘రైతులు పరస్పరం చర్చించుకోవడానికి వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే రైతు వేదికల నిర్మాణం జరపాలి. 5వేల ఎకరాలకు ఒకటి చొప్పున వ్యవసాయ క్లస్టర్లను ఏర్పాటు చేశాం. ప్రతీ క్లస్టర్ కు ఒక వ్యవసాయ విస్తరణాధికారిని కూడా నియమించాం. క్లస్టర్ల వారీగా రైతులు ఎప్పటికప్పుడు కలుసుకుని చర్చించుకోవడానికి వీలుగా వెంటనే క్లస్టర్ కు ఒకటి చొప్పున 2500 క్లస్టర్లను నిర్మించాలి’’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు.

క్రియాశీలకంగా రైతుబంధు సమితులు
-------------------------------------------
‘‘రైతులను సంఘటిత శక్తిగా మార్చే గొప్ప సంకల్పంతో ప్రభుత్వమే పూనుకుని రైతుబంధు సమితులను ఏర్పాటు చేసింది. రైతుకు చేదోడు వాదోడుగా ఉండడం కోసం ఏర్పాటైన ఈ సమితులు కిర్యాశీలకం కావాలి. రైతు బంధు సమితులు ఏమి చేయాలి? రైతులకు సహాయకారిగా ఎలా మారాలి? అనే అంశాలపై సమగ్రమైన కార్యాచరణ రూపొందించాలి’’ అని సిఎం అధికారులను ఆదేశించారు.

ఏజెంట్ల ద్వారా విత్తనోత్పత్తి చేయొద్దు
------------------------------------------
‘‘గద్వాల లాంటి ప్రాంతాల్లో కొందరు రైతులు విత్తనాలు ఉత్పత్తి చేస్తున్నారు. కానీ వారు నేరుగా కంపెనీలతో ఒప్పందం చేసుకోకుండా, వారి ఏజెంట్ల ద్వారా చేస్తున్నారు. దీనివల్ల తర్వాత రైతులకు ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి విత్తనోత్పత్తి చేసే రైతులు నేరుగా కంపెనీలతో ఒప్పందం చేసుకుని సాగు చేయాలి’’ అని సిఎం సూచించారు.


నకిలీలు, కల్తీల విషయంలో కఠిన వైఖరి
----------------------------------------------
‘‘రాష్ట్రంలో కల్తీలు, నకిలీల విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నది. నకిలీ ఎరువులు, పురుగుమందులు, కల్తీ విత్తనాలు అమ్మే వారిపై పిడి యాక్టు నమోదు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి దుర్మార్గం చేసే వారిని ఇంటెలిజెన్స్ ఇప్పటికే గుర్తించింది. వారి కదలికలపై నిఘా పెట్టాం. తెలంగాణ రాష్ట్రంలో కల్తీలు, నకిలీలు ఎట్టి పరిస్థితుల్లో చలామణి కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం. ఇంకా ఎవరైనా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే కఠినాతి కఠినంగా శిక్షిస్తాం’’ అని సిఎం హెచ్చరించారు.

You Might Also Like