తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ ప్రకటన చేశారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో బుధవారం మద్యం దుకాణాలు తెరుస్తున్నట్లు చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అమ్మకాలకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. కంటైన్మెంట్‌ జోన్లు మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు చేపట్టవచ్చు అన్నారు. రెడ్‌జోన్‌ జిల్లాలో కూడా మద్యం షాపులు తెరుచుకోవచ్చన్నారు. మద్యం రేట్లను 16 శాతం పెంచుతున్నట్లు సీఎం తెలిపారు. చీప్‌ లిక్కర్‌పై మాత్రం 11 శాతం పెంపు ఉంటుందన్నారు. లాక్‌డౌన్‌ తర్వాత సైతం కూడా ఇవే రేట్లు కొనసాగుతున్నాయన్నారు. కాగా బార్‌లు, పబ్‌లు, క్లబ్‌లకు అనుమతి ఎట్టిపరిస్థితుల్లో లేదన్నారు. మద్యం దుకాణాదారులు, మద్యం కొనుగోలుదారులు కచ్చితంగా నిబంధనలు పాటించాలన్నారు. మాస్కులు లేకపోతే మద్యం ఇవ్వొద్దన్నారు. భౌతికదూరం తప్పని సరిగా పాటించాలన్నారు. నిబంధనలు పాటించని షాపులను క్షణాల్లో సీజ్‌ చేస్తామని హెచ్చరించారు.


కేంద్ర ప్రభుత్వ సడలింపు వల్ల మన చుట్టు ఉన్న నాలుగు రాష్ర్టాలు మద్యం దుకాణాలు తెరిచినట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. మన రాష్ట్రంలో ఏపీ 890 కిలోమీటర్ల మేర, మహారాష్ట్ర 700 కిలోమీటర్ల మేర కర్ణాటక 500 కిలోమీటర్ల మేర, చత్తీస్‌గఢ్‌ 230 కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటున్నాయి. ఇప్పటికే గుడుంబా తయారీ మొదలైంది. ఈ నాలుగు రాష్ర్టాల్లో షాపులు తెరవడం వల్ల మనవాళ్లు కూడా అక్కడికి పోటెత్తుతున్నారు. ఈ పరిస్థితుల్లో వంద శాతం దుకాణాలు తెరవడం తప్ప గత్యంతరం లేదన్నారు. అనేక సమాలోచనల అనంతరం మంత్రి వర్గం కూడా ఇందుకు ఆమోదం తెలిపిందన్నారు.

You Might Also Like